Pages

Vastu



                                                                                 
                                                                స్థల  యోగ 

          అన్ని  శాస్త్రముల  యొక్క  ముఖ్య  ఉద్దేశ్యము మానసిక, శారీరక, సాంఘీక  పురోభివృద్ధియే!
          ఆనందము  పొందుటకు  మన పూర్వీకులు  ఆసన , ప్రాణాయామ  క్రియలు  యోగము  ద్వారా  మనకు  అందించినారు.యోగాభ్యాసం  ద్వారా  మన  శరీరములోని  పంచభూతశక్తి  పూర్తిగా  వినియోగింపబడును. ప్రకృతి చికిత్సలోను  పంచభూత శక్తిని  పూర్తిగా  వినియోగించుచున్నారు. ( భూమి - మట్టి  పట్టీలు ,  జలము - తొట్టి  స్నానము , అగ్ని - సూర్య  నమస్కారములు , వాయువు - ప్రాణాయామము , ఆకాశము - ఉపవాసము )  ఈ  ఒరవడిలో  మనము  నివశించు  స్ఠలమునందు  పంచ  భూత  శక్తుల  స్థావరము  గ్రహించుము.

భూమి      :  స్థలములోని  ఎత్తు  పల్లములు  సరిచేయుట.
జలము     :  స్థలములోని  జలమును  వినియోగించుట. ఇది  తూర్పు  సూర్యనాడి , ఉత్తర  చంద్రనాడుల  సంగమ  స్థానము.
అగ్ని        :  స్థలములోని  అగ్నిని  వినియోగించుట. ఇది  తూర్పు సూర్యనాడి , దక్షిణ  చంద్రనాడుల  సంగమ  స్థానము.  
వాయువు  :  స్థలములోని  వాయువును  వినియోగించుట .  ఇది  ఉత్తర  చంద్రనాడి ,  పడమర  సూర్యనాడుల  సంగమ  స్థానము.
ఆకాశము  :  స్థలములోని  ఆకాశ  తత్వమును  వినియోగించుట.  ఇది  పడమర  సూర్యనాడి ,  దక్షిణ  చంద్రనాడుల  సంగమ  స్థానము.
         
           యోగాభ్యాసములో  పంచభూతశక్తి  ఏకీకరణతో  మరియు  సమతుల్యలతో  లబించుచున్నది. మనము  నివశించు  స్థలములోని  కుండలినీ  శక్తిని  గ్రహించుము.

మూలాధారము  :  భూమి  :
         
           స్థలము  ఎత్తు  పల్లములు  సరిచేయుట. స్థలము  దక్షిణ , పడమరలు  మెరక , తూర్పు , ఉత్తరములు  పల్లముగా  ఉన్న  ( గదులతో  సహా )  మనము  మన  స్థలములోని   " భూశక్తి "  ని  సద్వినియోగ  పరచినట్లగును.
          రంగు - ఎఱుపు ;  పూజా  విధానము - ధూపము ;  బీజాక్షరము - " లం "  ;  జ్ఞానేంద్రియము - ముక్కు ;  కర్మేంద్రియము - కాళ్ళు ;  నివేదన - పెసర పప్పు  అన్నము ; గ్రంధి - ప్రోస్టేట్ ;  కూరలు - దుంపకూరలు ;  పువ్వు - ఎఱుపు  రంగువి ;  ధాతువు -  ఎముక ;  యంత్రము -  " లం , వం , శం , షం , సం " ;  మంత్రము - మూలాధారాయ  " లం "  బీజా  నమోనమః ;  విగ్రహారాధన - అమ్మవార్లు ,  గ్రామ  పొలిమేర  దేవతలు .

సాధారణ  లక్షణములు :
          
          ముక్కు ,  ఎముకలు , కాళ్ళు , హెర్నియా , పక్షవాతము , మెదడు , ప్రోస్టేటు  ట్రబుల్స్ , లింఫ్  గ్రంధులు ,  సైనస్ , మలబద్ధకము , నీళ్ళ  విరేచనములు , భయము , పిరికి , మూర్ఖపు  పట్టుదల , తన  వరకు  ఆలోచన ,  మానసిక  భయము , సివిల్  మరియు ఎగ్రికల్చరల్ ,  పోరాడు  పటిమ ,  హోర్డింగ్ .

స్వాధిష్టానము :  జలము  : 
         
           స్థలములోని  జలశక్తిని  వినియోగించుట .  జలము  స్థలములోని  తూర్పు  సూర్యనాడి ,  ఉత్తర  చంద్రనాడుల  సంగమము . స్థలము  అన్ని  భాగముల  కంటే  పల్లముగా  నుంచవలెను .  " బావి "  స్థానము  నీరు  సైతము  పల్లములోనే  ఉండవలెను . వంశాభివృద్దిని  కల్గించు  స్థానము .  దీనిలో  సూర్యనాడి  మగ  సంతతి  పైనను ,  చంద్రనాడి  స్త్రీ  సంతతిపై  ప్రభావమును  చూపును .  రెండు  నాడులలో  ద్వారములు  ప్రశస్తములు . 
          రంగు - ఆరంజ్ ;  పూజా  విధానము - తీర్థము ;  బీజాక్షరము -  " వం " ;  జ్ఞానేంద్రియము - నాలుక ; కర్మేంద్రియము - చేతులు ; నివేదన - పెరుగన్నము ;  గ్రంధి - టేస్టిస్  మరియు  ఓవరిస్ ;  కూరలు - క్యారెట్ ;  పువ్వు - ఆరంజ్  రంగువి ;  ధాతువు - కొవ్వు ;  యంత్రము - " వం , బం , భం , మం , యం , రం , లం "  ;  మంత్రము - స్వాధిష్టాయ  " వం "  బీజే  నమోనమః  ;  విగ్రహారాధన -  " గంగాదేవి "   " రాజరాజేశ్వరి దేవి "   " అన్నపూర్ణా దేవి "  మరియు   "  లక్ష్మీదేవి  " .

సాధారణ  లక్షణములు  :
          
          నాలుక , చేతులు , కొవ్వు , కిడ్ని , మూత్ర , సయాటికా , ఎపండిక్సు , కళ్ళ  నీటికాసులు ,  న్యూరోసిస్ ,
          ధైర్యము ,  నిరంతర  కృషి ,  కోపము ,  హస్తకళాకారులు ,  మిలటరీ , కవులు , పోలీసు  ఆఫీసర్లు ,  ఆజానుబాహులు , కళలయందు  ఆసక్తి  మరియు  అవగాహన ,  నిత్యశంకులు , విరుద్ధ  భావము  కలవారు ,  వాటర్  డివైనర్స్ ,  వంశాభివృద్ధి  కోరువారు .  బాక్సర్స్ , కరాటే , టేస్టర్స్ .

మణిపూరకము  :  అగ్ని  :

          స్థలములోని  అగ్ని  శక్తిని  వినియోగించుట.  అగ్ని  మన స్థలములో  తూర్పు  సూర్యనాడి ,  దక్షిణ  చంద్రనాడుల  సంగమము .  దీనిలో  సూర్యనాడి  వంటకు  ప్రశస్తము .  చంద్రనాడి  ద్వారము .  ఈ  స్థానములో  సూర్యనాడి  ద్వితీయ  మగ  సంతతి  పైనను ,  చంద్రనాడి  ద్వితీయ  స్త్రీ  సంతతి  పైనను  తన  ప్రభావమును  చూపును .
          రంగు - పసుపు ;  పూజావిధానము - దీపారాధన ,  విగ్రహారాధన  మరియు  అలంకారము ;  బీజాక్షరము - " రం "  ;  జ్ఞానేంద్రియము - కళ్ళు ;  కర్మేంద్రియము - మలద్వారము ;  నివేదన - బెల్లము  కలిపిన  అన్నము ;   గ్రంధి - ఎడ్రినల్ ,  పాంక్రియాస్ ;  కూరలు - దోస ;  పువ్వు - పసుపు రంగువి ;  ధాతువు - కండరము ;  యంత్రము -  " రం " ,  డం ,  ఢం ,  ణం ,  తం ,  థం ,  దం ,  ధం , నం , పం , ఫం ;  మంత్రము  -  మణిపూరాయా   " రం "  బీజేనమోనమః  ;  విగ్రహారాధన - సూర్యుడు ,  విష్ణుమూర్తి , రాముల వారు .

సాధారణ  లక్షణములు  : 
   
       కళ్ళు , కండరములు , మలద్వారము , అరుగుదల , షుగర్ , గ్యాస్ట్రో  ఇంటస్టైనల్  డిసార్డర్స్ , లివర్ , అల్సర్స్ , డయాఫ్రమ్  డిసార్డర్స్ , ఎడ్రినల్ , డిప్రషన్స్ .
          మూర్ఖపు  కార్యదీక్ష , మర్యాదస్తులు , భోగలాలసులు , చాయాగ్రాహకులు , రసికులు , ఉద్రేకమును  అణగద్రొక్కేవారు , మఠాధిపతులు , ఋత్విక్కులు , గణిత  విద్యాసక్తులు , స్వయం  నిర్ణయాధికులు ,  వేషాడంబరము , దంతపుష్టి , ముందుచూపు , గృహవాస్తు , కట్టడములకు  నమూనాలు  వ్రాయుట , డైనమిక్ ,  మనీ  మేకర్స్ ,  గుడ్ ఎడ్మినిస్ట్రేటర్ ,  సైక్రియాటిస్ట్ ,  బాడీ  బిల్డర్స్ ,  విజడమ్ ,  కాంపిటేటర్స్ ,  మెకానికల్  ఇంజనీర్స్ .

విశుద్ధ  :  వాయువు  :

          స్థలములోని  వాయు  శక్తిని  వినియోగించుట .  వాయువు  స్థలములోని  పడమర  సూర్యనాడి ,  ఉత్తర  చంద్రనాడుల  సంగమము .  కళల  స్థానము .  దీనిలో  సూర్యనాడి  పురుష  తృతీయ  సంతతి  పైనను ,  చంద్రనాడి  తృతీయ  స్త్రీ  సంతతి  పైనను  తన  ప్రభావమును  చూపును . దీనిలో  చంద్రనాడి  కళలకు  ప్రశస్తము .  సూర్యనాడి  ద్వారమునకు  ప్రశస్తము .
          రంగు - నీలము ;  పూజా  విధానము - కీర్తనలు ;  బీజాక్షరము - " హం "  ;  జ్ఞానేంద్రియము - చెవులు ;  కర్మేంద్రియము - చర్మము ;  నివేదన - పాయసన్నం ;  గ్రంధి  థైరాయిడ్ , పారాథైరాయిడ్ ;  కూరలు - పెద్ద  చిక్కుళ్ళు ;  పువ్వు - శంఖు పువ్వు ;  ధాతువు - చర్మము .

యంత్రము  :  " హం "  అం , ఆం , ఇం , ఈం , ఉం , ఊం , ఋం , ౠం , ఐం , ఎం , ఏం , ఒం , ఓం , అం , అః
మంత్రము  :  విశుద్దాయ  " హం "  బీజే  నమోనమః
విగ్రహారాధన  :   " సరస్వతీ  దేవి ,  ఆంజనేయ  స్వామి ,  వెంకటేశ్వర  స్వామి .

సాధారణ  లక్షణములు  : 
      
           ఊపిరితిత్తులు ,  ఆస్త్మా ,  చర్మము ,  వాక్కు ,  ఎలర్జీ ,  టి.బి ,  గుండె  నెప్పులు ,  కీళ్ళ  నెప్పులు ,  ఆత్మహత్యా  ప్రయత్నము .
         
           లోభత్వము , ఊహలు , రాజకీయము ,  క్రొత్త  విషయములు  వెలికి  తీయువారు ,  లాయరులు ,  రాజకీయ  నాయకులు ,  యాక్టరులు ,  సంగీత  విద్వాంసులు ,  ఇతరులపై  ఆధారపడువారు ,  మంచి  బేరగాళ్ళు ,  మధ్యవర్తులు ,  సరస్వతీ  పుత్రులు ,  స్వయం  నిర్ణయము  లేని  ఆవేశపరులు ,  ఎల్లప్పుడు   ప్రేమ  ఆప్యాయతల  కొరకు  తపించువారు ,  భక్తులు ,  మూఢాచారము  కలవారు ,  ఎక్కువ  మాట్లాడుటయందు  అభిలాష  కలవారు ,  వాదనాపరులు ,  వివాహమునందు  విడాకులు  పొందువారు ,  ఆహార  నియంత్రణ  లేనివారు ,  ఊహాలోకములలో  విహరించెడివారు ,  ఇతరులకు  సహాయము  చేసి  చెడు  ఫలితములు  పొందెడివారు ,  జ్ఞాని  ఊహలు  కలవారు ,  న్యాయనిర్ణేతలు ,  సమ్మోహనాపరులు ,  మంచి  తల్లితండ్రులు ,  నసపెట్టువారు , మోసగింపబడువారు ,  లలిత  కళాభిమానులు ,  స్వరకర్తలు ,  ప్రస్తుత  ప్రపంచమునకు  సరిపడువారు .

ఆజ్ఞా  :  ఆకాశము  :

          స్థలములో  ఆకాశతత్త్వమును  వినియోగించుట .  ఆకాశతత్త్వము  స్థలములోని  పడమర  సూర్యనాడి ,  దక్షిణ  చంద్రనాడుల  సంగమము .  దీనిలో  సూర్యనాడి  తండ్రిపైనను , ప్రథమ  మగ  సంతతిపైనను  మరియు  చంద్రనాడి  తల్లిపైనను ,  ప్రథమ  ఆడ  సంతతిపైనను  తన  ప్రభావమును  చూపును .  ఇది  అన్ని  భాగములకన్న  ముఖ్యమైనది .  దీని  సూర్యనాడిలో  గాని ,  చంద్రనాడిలో  గాని ,  ఎట్టి  పరిస్థితులలోను  ద్వారముల  నుంచరాదు .  ఎందుకనగా  స్థల  శక్తి  ఈ  స్థానము  నుండి  బయలుదేరి  అగ్ని ,  వాయువు ,  జల ,  దిక్కుల  వైపు  ప్రవహించి  బలహీనపడును .  ఈ  స్థానము  యందు  ద్వారములున్న  " శక్తి "  ద్వారముల  ద్వారా  బయటకు  పోయి  అగ్ని ,  వాయు ,  జల  దిక్కులకు  ప్రసరించదు .  ఇది  సంపూర్ణస్థానము .

          రంగు - ఇండిగో ;  పూజా  విధానము - గంట ,  ధ్యానము ;  బీజాక్షరము -  " సం "  ;  నివేదన - పులిహోర ,  ఫలావు ;  గ్రంధి - పిట్యూటరీ ;  కూరలు - వంకాయ ; ధాతువు - మజ్జ  ;  పువ్వు  -  సీజనల్స్ .

యంత్రము    :  " సం "  హం ,  క్షం
మంత్రము     :  ఆజ్ఞాయ  "  సం  "  బీజే  నమోనమః
విగ్రహారాధన  :  " వినాయకుడు "  ,   " శివుడు "  ,  శ్రీ కృష్ణుడు .

సాధారణ  లక్షణములు  :

     మజ్జ ,  క్యాన్సర్ ,  తలనెప్పులు ,  టెన్షన్స్ ,  సెంట్రల్  నెర్వస్  సిస్టమ్ ,  డిప్రషన్స్ ,  ఎమ్మోషన్స్ ,  మెదడు .

          జ్ఞానయోగులు ,  సైంటిస్టులు ,  తొందరపాటు  మనుషులు ,  తమ తప్పును  ఒప్పుకునే  ధైర్యవంతులు ,  ఆలోచన  ఆచరణ  మధ్య  చాలా  తేడాగలవారు ,  విపరీతమైన  తెలివి  తేటలతో  తమ  జీవిత  గమనమునకు  అవరోధము  కల్గించుకొనువారు ,  పొదుపరులు ,  సంపూర్ణ  వికాసము  కల్గిన  వ్యక్తులు .                                                                                              
                                         
                                     స్థలము                    కుండలినీ                   ధ్యానము                       కాలము
                                     భూమి                   మూలాధారము                వాసనలు               తె.జా. 4 గం. నుండి 6 గం. వరకు
                                     ఈశాన్య                  స్వాధిష్టానము                  రుచులు                ఉ.6 గం. నుండి 9 గం. వరకు
                                     ఆగ్నేయ                 మణిపూరము                  రూపము               ఉ.9 గం. నుండి 12 గం. వరకు
                                     వాయువ్య                విశుద్ధము                      స్పర్శ                   మ.12 గం. నుండి 6 గం. వరకు
                                                                                                                            తె.జా. 2 గం. నుండి 4 గం. వరకు
                                     నైఋతి                    ఆజ్ఞ                            శబ్ధము                   సా.6 గం. నుండి 2 గం. వరకు

                                     పంచభూతములు                      కుండలినీ                            దిక్కులు
                                        భూమి                               మూలాధారము                         స్థలము   
                                        నీరు                                  స్వాధిష్టానము                          ఈశాన్యము
                                        అగ్ని                                 మణిపూరకము                         ఆగ్నేయము
                                        వాయువు                           విశుద్ధము                               వాయువ్యము
                                        ఆకాశము                            ఆజ్ఞ                                      నైఋతి


                                                             నీ  స్థలము  లోనికి  108  మెట్లు

     ఈశాన్యము :
       
   ఈశాన్యము  ప్రారంభ  స్థానము . యోగములో  స్వాధిష్టానము .  గ్రంధి  టెస్టిస్  మరియు  ఓవరీస్ . తూర్పు  సూర్యనాడి ,  ఉత్తర  చంద్రనాడుల సంగమము .
          
   1.     ప్రతి  స్థలమునకు  ఈశాన్యము  నీటికి  సంబంధించిన  స్థానము .  ఈశాన్యము  పల్లము  కల్గి  నీరు  పోవు  కంతలు  ఉంచవలెను .
  
   2.    ఈశాన్యములో  కాలిజోళ్ళు ,  చీపురు ,  సిగరెట్ ,  విడిచిన  వస్త్రములు ,  బూజు  కర్రలు  మొదలగునవి  వీటిని  ఉంచరాదు . పూజా  సామాగ్రిని  సైతము  నుంచరాదు .
   
   3.    స్థలమునకు  తూర్పు  ఈశాన్యములో  గేటు  ఉంచవలెను .  వీలు  పడనిచో  గృహములోనైనను  తప్పని  సరిగా  తూర్పు  ఈశాన్యములో  గేటు  ద్వారము  నుంచవలెను .  ఈ   
          విధముగా  లేని  యెడల  ఆ  స్థలమునకు  సూర్యనాడి  లోపించును .
   4.    ఈశాన్యములో  సూర్యనాడి  ద్వారము  వంశాభివృద్ధి  ఎనలేని  కీర్తి  లభించును . చంద్రనాడి  ద్వారము  ఎనలేని  సంపద ,  స్త్రీ  శక్తి  నిచ్చును .
  
   5.    ఈశాన్య  గదిలో  తూర్పు  ఆగ్నేయ  ద్వారమున్న  సూర్యనాడి  ప్రభావము  అధికమై  చెఱుపుచేయును .  ఉత్తర  ఈశాన్య  ద్వారముతో  దక్షిణ  ఆగ్నేయ  ద్వారముంచవచ్చును .  
          దక్షిణ  నైఋతి ,  పడమటి  నైఋతి  ద్వారములు  నుంచరాదు . పడమట  వాయువ్యంలో  సూర్యనాడి  ఋణదృవముగాన  ద్వారము  నుంచవచ్చును .  ఉత్తర  వాయువ్య   
          ద్వారము  నుంచరాదు .

   6.    ఈశాన్యము  తగ్గిన  తతిమా  మూలలను  సరిచేసి  ఈశాన్యమును  సరిచేయవలెను .  గృహమునకు  ఉత్తర  ఈశాన్యము  పెంచి  నిర్మించిన ,  స్థలమునకు  ఉత్తర  ఈశాన్యము  
         తగ్గును .  ఉత్తర  ఈశాన్యము  పెరిగిన  ఆధ్యాత్మిక  ఆసక్తి  తరిగి  సంసార  అనురక్తి  పెరుగును .

   7.     స్థల  ఈశాన్యములో  ఎటువంటి  నిర్మాణములు  చేయరాదు .  నిర్మించినచో  గృహ  యజమానికి  ప్రకృతికి  సంబంధించిన  అనుకూలత  లభించదు .  మొండి  పట్టుదలలు  పెరిగి , 
          సరి  అయిన  అవగాహన  లేని  నిర్ణయములు  తీసుకుని ,  తన  పురోభివృద్ధికి  తనే  ఆటంకమగును .  

   8.     స్థల  ఈశాన్యములో  తూర్పు ,  ఉత్తర  ప్రహరీ  గోడలు  పడమట ,  దక్షిణ  గోడలను  మించరాదు .  మన  తూర్పు  ప్రహరీ  ఇతరులకు  పడమటి  ప్రహరీ  అగుటవలన ,  మన  
          ఉత్తర  ప్రహరీ  ఇతరులకు  దక్షిణ  ప్రహరీ  అగుటవలన  ఎత్తుగా  నిర్మించుట  జరుగుచున్నది .  తూర్పు  ప్రహరీ  పురుష  సంతతి  పురోభివృద్ధి  పైనను ,  ఉత్తర  ప్రహరీ  స్త్రీ  
          సంతతి  పురోభివృద్ధి  పైనను  తన  ప్రభావమును  చూపును .  తల్లిదండ్రులకు  సంతతికి  అభిప్రాయ  బేధము  వచ్చినప్పుడు  ముఖ్యముగా  ఈ  విషయము  
          గుర్తుంచుకొనవలయును .

   9.     గృహమును  ఈశాన్యము  తగ్గించి  నిర్మించరాదు .  చతురములో  ఈశాన్యము  తగ్గరాదు .  పెంచరాదు .  గదుల  నిర్మాణములలోను ,  పోర్టికోల  నిర్మాణములలోను  సన్ షేడ్  
         నిర్మాణములలోను  జాగ్రత్త  వహించవలెను .  ఈశాన్యము  మాత్రమే  మూసిన  ఆగ్నేయము  తెరిపగును .  సంపద  పరముగా  అనుకూలముగా  ఉండి ,  సమాజ  గుర్తింపు  
         తగ్గును .

  10.    గృహమునకు  తూర్పు ,  ఉత్తర  వసారాలు ,  ఏకవాలున  మాత్రమే  నిర్మించవలెను .  అట్లు  నిర్మించనిచో  గృహయజమాని   తన  సహజ  గుణములను  కోల్పోవును .

  11.    గృహములో  ప్రతి  గదులలోను  తూర్పు ,  ఉత్తర  గోడలకు  అటకలు  నిర్మించరాదు .  ఈ  గోడలను  దాటి  ముందుకు  వచ్చిన  
        అలమారాలను  సైతము  నిర్మించరాదు .

  12.   ఈశాన్య  ద్వారములను  సాధ్యమైనంతవరకు  తెరిచి  ఉంచవలెను .  గేటులో  చిన్న  ద్వారము  నుంచవలసి  వచ్చిన  దీనిని  సైతము  ఈశాన్యములోనే  ఉంచవలెను .  ఈశాన్య  
        ద్వారములలో  ఒక రెక్క  మాత్రమే  తెరిచి  ఉంచవలెను .  ఈశాన్య  వైపు  రెక్కనే  తెరిచి  ఉంచవలెను .  ఏక  రెక్క  తలుపైన  ఆగ్నేయ  దిమ్మలో  నుంచవలెను .

  13.   ఎట్టి  పరిస్థితులలోను  ఈశాన్యములో  వంట  చేయరాదు .  వేడి  నీటి  పొయ్యిలు  గాని ,  బ్రాయిలర్లు గాని  ఈశాన్యములో  నుంచరాదు .  పరిశ్రమలలో  కరెంటు  ట్రాన్స్ ఫార్మర్స్ 
        గాని  ,  పొగ  గొట్టముల  నుంచరాదు .

 14.   ఈశాన్యములో  నిద్రించరాదు .  మంచములు  నిలబెట్టి  ఉంచుట  సైతము  చేయరాదు .  పరిశ్రమలలో  ఈశాన్యములలో  క్వార్టర్స్  నిర్మించరాదు . 

  15.   ఈశాన్యములో  పదఘట్టన  చాలా  మంచిది .  ప్రతి  గదుల  యందును , ఇంటి  కాంపౌండు  యందు ,  పరిశ్రమల  కాంపౌండు  యందు ,  ఈశాన్య  పదఘట్టన  చాలా  మంచిది . 

 16.   ఈశాన్యములో  బీరువాలు గాని ,  ఇనపెట్టెలు గాని ,  బరువులు గాని  ఉంచరాదు .  తూర్పు , ఉత్తర  గోడలకు  ఆనించి  ఏ  వస్తువులను  ఉంచరాదు .  పరిశ్రమలయందు ,  
        షాపులయందు   ఈశాన్యములో  కూర్చొని  వ్యాపారము  చేయరాదు .

 17.   ఈశాన్యము  ఎల్లప్పుడూ  శుభ్రముగాను ,  ఆకర్షణీయమైన  రంగులతోను ,  సువాసనతోను ,  ఆనందము  కల్గించునదిగాను  ఉండవలెను .  నూతిని  సైతము  రంగు  వేసి  
        ఆకర్షణీయముగా  ఉంచుట  మంచిది .

 18.   ఈశాన్యగదిలో  కుర్చీలను ,  తతిమా  బరువులను ,  పడమట , దక్షిణ గోడలకు  ఆనించి  ఉంచవలెను .  షాపులకు  తూర్పు  రోడ్డు  కల్గిన నైఋతిలో  బరువునుంచి  ఆగ్నేయములో  కూర్చోని ,  దక్షిణము  రోడ్డు కల్గిన  నైఋతిలో   కూర్చొని ,  పడమట   రోడ్డు  కల్గిన  నైఋతిలో   కూర్చొని, ఉత్తరము  రోడ్డు  కల్గిన  నైఋతిలో   బరువు  నుంచి  వాయువ్యంలో కూర్చొని  తూర్పున   గాని ,  ఉత్తరమును  గాని  చూస్తూ  వ్యాపారము చేయవచ్చును .  పడమర ,  దక్షిణము  రోడ్డు  కల్గిన  షాపులవారు  షట్టరు  క్రింద  అడ్డముగా  కట్ట  నిర్మించవలెను .  దక్షిణ ,  పడమర  షాపువారు మరియు  దక్షిణ ,  పడమర  సింహ  ద్వారములు  కల్గినవారు  క్రిందకు ఏకంగా  దిగకుండా  దక్షిణము  వారు  తూర్పుకు , పడమర  వారు ఉత్తరమునకు  దిగవలెను .

  19.   ఈశాన్య  గదికి  3  ద్వారములు  నుంచరాదు .  సమతూకము  కోల్పోయి  చెఱుపును  కల్గించును .  వరుస  3 ద్వారములు  సైతము  మంచిది  కాదు .  గోడను  చేధించి  మనము  
        నడిచెడి  అన్నియు  ద్వారములు  క్రింద  లెక్కించ  వలయును .  ద్వారములు  సరిసంఖ్య  కల్గి  ఉండవలెను .

 20.    ఈశాన్యములో  ధనమును  ఉంచరాదు .  గడ్డు  పరిస్థితులు  కల్గినప్పుడు ,  కొంత కాలము  ధనమును  ఈశాన్యన  ఉంచి మరల  నైఋతిలోనే  ఉంచవలయును . ( లోడ్ గేర్ )  
        ఈశాన్యములో  ధనము  నిలువదు .

 21.    ఈశాన్యములో  యోగులకు  సాధన  నిలువదు .  ఎటువంటి  కళలకు  స్థానము  కాదు . ఈశాన్య  స్థానములో  ఏ  పనులు  రాణించవు .  కాని  ముఖ్యమైన  ప్రారంభ  స్థానము  
        ఇదియే .  ఈశాన్యములో  ప్రారంభించి  తతిమా  స్థానములకు  వెళ్ళవలయును .  

 22.    ఈశాన్య  గది  అన్ని  గదుల  వైశాల్యము  కంటే  తగ్గి  ఉండవలెను .  ఈ  విధముగా  ఉండుటము  అన్ని  విధములా  శ్రేయస్కరము .

 23.    ఈశాన్య  స్థలమునకు తూర్పు ,  ఉత్తర  ఈశాన్య  వీధి  పోట్లు  చాలా  మంచిది .  వీటిని  వినియోగించిన  సమాజములో  మంచి  స్థానము  కల్గి  ఉన్నతులగుదురు . 

 24.    ఈశాన్యములో  లక్ష్మి ,  అన్నపూర్ణ ,  రాజరాజేశ్వరి ,  గంగ ,  మేరీమాత ,  నెలవంకతో  నున్న  మసీదు ,  చిత్రపటములను  ఉంచి  పూజించవలయును .  ఈశాన్యములో  గోడను  
         మించి  ముందుకు  వచ్చిన  దిమ్మతో  కల్గి  ఉన్న  దేవుని  మందిరములు  నిర్మించరాదు . 

 25.    ఈశాన్యము  ఖచ్చితముగా  కోణము  90o   కల్గి  ఉండవలెను .  ఈశాన్యములో  ఆరంజ్  రంగు  కల్గిన  పూలు  పూచే  మొక్కలు  బాగా  పెరుగును .  

    ఆగ్నేయము  :

 26.    ఆగ్నేయ  భాగము  విజయ  స్థానము .  యోగములో  మణిపూరకము . గ్రంధి  పాంక్రియాస్ ,  ఎడ్రినల్ .  తూర్పు  సూర్యనాడి  దక్షిణ  చంద్రనాడుల  సంగమము . 

 27.    ఆగ్నేయ  భాగము  ఈశాన్య ,  వాయువ్య  భాగముల  కంటే  ఎత్తుగాను ,  నైఋతి  కంటే  తగ్గి  ఉండవలెను .

 28.    ఆగ్నేయ  భాగము  సూర్య  నాడిలోని  తూర్పు  వైపుకు  తిరిగి  వంట చేయవలెను . వంటచేయు  అరుగులు  తూర్పు  గోడకు  ఆనించరాదు .  క్రింద  నేల  ఎత్తు చేయరాదు . 
         ఆగ్నేయ  గదిలో  మినహా  ఏ  గదులలోను  వంట  చేయరాదు . వంట  గదులకు  తూర్పు , ఉత్తర  ఈశాన్యములు ,  దక్షిణ  ఆగ్నేయము , పడమర  వాయువ్యములు , 
         ద్వారములు  కల్గి  ఉండిన ,  వండిన  పదార్ధములు  అమిత  రుచి  కల్గి , గృహములోని  అందరికి  దంత  సిరిని  కల్గించును .  వంట  గదికి ,  ఉత్తర  వాయువ్య  ద్వారము  మాటల  
         భోజనము ,  తూర్పు  ఆగ్నేయము  కలహ  భోజనము ,  దక్షిణ  నైఋతి  నిస్పృహ , నిరాశల  భోజనము ,  పడమర  నైఋతి  అర్ధాకలి  భోజనమును  కల్గించును . 

 29.    ఆగ్నేయ  భాగములో  నీరు  పోవు  కంతలుంచరాదు .  వేరే దారి  లేనప్పుడు  కంటికి  కన్పించకుండా  అండర్ గ్రౌండ్  ద్వారా  నీటిని  బయటకు  పంపించవలెను .

 30.    ఆగ్నేయ  భాగములోని  సూర్యనాడి  రెండవ  మగ  సంతతి  పైనను ,  చంద్రనాడి  రెండవ ఆడ  సంతతి  పైనను  తన  ప్రభావమును  చూపును .  సూర్యనాడి  ధన  దృవమైనందున  
        ద్వారముంచరాదు .  చంద్రనాడి  ఋణ  దృవమైనందున  ద్వారమునుంచవచ్చును .

 31.    ఆగ్నేయ  భాగములో  బరువులను  ఉంచినప్పుడు  తూర్పు  గోడను  ఆనించక  దక్షిణ  గోడను  ఆనించి  ఉంచవలెను . ఆగ్నేయ  భాగములో  బరువు  మరియు  ఎత్తులు  నైఋతి  
        భాగములోని  బరువులు  మరియు  ఎత్తున  కన్న  తగ్గి  ఉండవలెను .  పరిశ్రమలలో  కరంట్  ట్రాన్స్ ఫార్మర్స్  మరియు  హీట్  బర్నర్స్ ,  పొగ  గొట్టములు  ఆగ్నేయ  భాగములోనే  
        ఉంచవలెను .

 32.   ఆగ్నేయ  భాగములో  కట్టిన  ఏ  గృహములకైనను  తూర్పు  భాగమును  ఎక్కువ  ఉంచి ,  పడమర  తగ్గి  ఉండవలెను .  వరుస  గృహములు  కట్టినను  మొత్తము  గృహములు  
        అన్నింటికి  పడమర  తగ్గి  తూర్పు  పెరగవలెను .

 33.   ఆగ్నేయ  భాగము  మూయవలెనని  ఉపగృహము  నిర్మించుచున్నారు .  ఇది  అంత  సౌఖ్యమైనది  కాదు .  ఎందువలననగా  తూర్పు  తగ్గి  ఉత్తరము  పెరుగుచున్నది .  
        పడమటలో  నిర్మించిన  గృహము  కంటే  తూర్పులో  నిర్మించిన  గృహ  వైశాల్యము  తగ్గవలెను .  రెండు  గృహములు  దక్షిణ  నుంచి  ఉత్తరము  వరకు  పొడవులు  సమానముగా  
        ఉండి  వెడల్పులో  తేడా  చూపించవలయును .  ఈ  విధముగానే  దక్షిణములో  నిర్మించిన  గృహము  కంటే  ఉత్తర  గృహ  వైశాల్యము  తగ్గవలెను . పొడవులు  సమానముగా  
        ఉంచి  వెడల్పులో  భేధము  తీసుకురావలయును .  ఆగ్నేయములో  మెట్లు  నిర్మించిన  తూర్పు  గోడకు  ఆనించకుండా  నిర్మించవలయును .  దక్షిణ  గోడకు  ఆనించి  
        నిర్మించవచ్చును .  మొదటి  మెట్లు  పడమట  దక్షిణ  వైపునకు  ఎక్కుచున్నట్లు  ఉండవలెను .  దిగెడి  మెట్లు  తూర్పు  ఉత్తరముల  వైపుకు  ఉండవలయును .  అన్నిటి  కన్న  
        ముఖ్యమైనది  పై  అంతస్తులో  తూర్పు  ఉత్తర  ఈశాన్యములు ,  దక్షిణ  ఆగ్నేయము ,  పడమట  వాయువ్య  ద్వారములకు  అనుగుణముగా  మెట్లు  నిర్మించవలెను .

 34.    ఆగ్నేయ  భాగములో  నిద్రించరాదు . యజమాని  ఆగ్నేయగదిలో  నిద్రించరాదు .  వ్యాపారస్తులు ,  ఉద్యోగస్తులు  ఆఫీసుగదిని  మరియు  నిద్రించే  గదిని  ముందుగా  వాస్తుకు  
        సరిచేయవలెను .  గదిని  గాని  ఆఫీసును  గాని   షాపుని  గాని  ముందుగా  నాలుగు  భాగములు  చేసి  సరిచేయవలెను .

 35.    ఆగ్నేయ  భాగములో   నీటితొట్టెలు గాని  , ఓవర్ హెడ్  ట్యాంకును  గాని  ఉంచరాదు .  ఉపశమనము  పసుపు  రంగు .  

 36.    ఆగ్నేయ  భాగములో  అధిక ( శ్రమ ) శబ్దము  చేసే  డోలు  వాయుద్యములు  మొదలగునవి  అభ్యసించుట  మంచిది .

 37.    ఆగ్నేయ  భాగము  తగ్గిన  జయము  తగ్గును .  ఇతరుల  జోక్యము  మనమీద  పెరుగును .  అనవసర  తలవంపులు ,  తెగని  తీరని  సమస్యలు ,  ప్రతి  విషయమునందు  
        జాప్యము  పెరుగును .

 38.   ఆగ్నేయ  భాగము  పెరిగిన  నిరంతరం  శ్రమ  స్వంతం  మాని  ఇతరులకు  ఉపయోగము ,  చికాకు ,  కోపము  కల్గును .

 39    ఆగ్నేయ  భాగము  పల్లముగా  ఉన్న  యెడల  శ్రామికులు ( పనివాళ్ళు )  ఎక్కువ  రోజులు  పనిచేయరు .  పరిశ్రమలలో  ముఖ్యముగా  గమనించవలసిన  విషయము .  ప్రతి  
        విషయము  స్థంభించును .  విల్ పవర్  తగ్గి  శక్తి  హీనులగుదురు . సమన్వయము  లోపించును . సంపదకు  తగ్గ  గౌరవముండదు .

 40.    ఆగ్నేయ  భాగము  ఎక్కువగా  వినియోగించు  స్థలములలో  పసుపు  రంగు  కల్గిన  పూలు  పూచే  మొక్కలు  బాగుగా  పెరుగును .  ఆగ్నేయ  భాగలోపములను  పసుపురంగుతో  
        " రం "  బీజాక్షరముతో  సరిచేయవలెను .

 41.    ఆగ్నేయ  భాగములో  గృహము  నిర్మించిన  అమితమైన  పేరు  వచ్చును .  కాని  మనశ్శాంతి  ఉండదు .  ధనము  విపరీతముగా  ఖర్చగును .  నిర్ణయములకు  వారి  
        జీవితమును  అర్పింతురు .  ఇతరులకు  సహాయము  చేయుటయందు  అభిలాష  పెరుగును .

 42.   ఆగ్నేయ  భాగములో  ధనము  ఉంచిన నిలువదు . జాగ్రత్తగా  జమ  ఖర్చులు  వ్రాసి  పొదుపు  చేసినను  ధనము  విపరీతముగా  ఖర్చగును . షాపులలో  ధనమును  
       ఆగ్నేయమున  ఉంచరాదు .

 43.   ఆగ్నేయ  భాగములో  కూర్చొని  ఆలోచించరాదు .  త్వరిత  నిర్ణయములకు  మంచిది .  "  నాడి  "  శాస్త్రములో  సుర్యనాడి  ప్రభావములు  అన్నియు  ఆగ్నేయ  భాగమునకు  
       చెందును .

 44.   ఆగ్నేయ  భాగములో  తూర్పుకు  అభిముఖముగా  కూర్చొని  దీపారాధన  చేసి  మనస్సు  నిల్పి  ధ్యానించిన  ఎటువంటి  జఠిల  సమస్యలకైనను  సమాధానము  లభించును .

 45.   ఆగ్నేయ  భాగమును  సరిచేసిన  షుగర్  వ్యాధి  తన  ప్రభావమును  తగ్గించును .  కళ్ళు ,  జీర్ణశక్తి ,  అల్సర్  విషయములోను  ఆగ్నేయ  భాగమును  గుర్తుంచుకొనవలయును .

 46.   దృశ్య  యంత్రములు  ఆగ్నేయములో  ఉంచవలెను .  " దీపధ్యానము "  ,  " త్రాటకము "  మొదలగు  సాధనలు  ఆగ్నేయములో  చేయవలెను .  ఉదరమునకు  సంబంధించిన  
        ఆసనములు ,  సూర్య  నమస్కారములు  ఆగ్నేయ  భాగములోనే  చేయవలెను . 

 47.    నిత్య  దీపారాధన ,  " ధుని "  ( నిరంతరం అగ్ని )  ఆగ్నేయ  భాగములో  నుంచవలెను .  పాలు  పొంగించు  కార్యక్రమము  ఈ  స్ధానమునందే  చేయవలెను .  పాల  కుంపటి  వేడి  
        నీళ్ళ  బాయిలర్ ,  ఉలవల  దాళి ,  ఆగ్నేయ  భాగములో  నుంచవలెను .  ఉలవల  దాళి  మెరక  గొయ్యిలో  ఉండవలెను .

 48.   ఆగ్నేయ  గది  నైఋతి  గది  కంటే  చిన్నది గాను  ఈశాన్య ,  వాయువ్యముల  కంటే  ఎక్కువ  వైశాల్యము  కల్గి  ఉండవలెను .

 49.   ఆగ్నేయ  స్థలమునకు  సూర్యనాడిలో  వీధిపోటు  మంచిదికాదు .  చంద్ర  నాడిలో  వీధిపోటు  ఉండవచ్చును .  ఆగ్నేయ  భాగము  ఖచ్చితముగా  90o   కోణము  కల్గి  ఉండవలెను .

 50.   ఆగ్నేయ  భాగములో  " సూర్యుని "   " విష్ణుమూర్తిని "   " రాముల  వార్ని  "   ముళ్ళ  కిరీటము  కల్గి  శిలువ  నెక్కిన  ఏసుక్రీస్తుల  వారిని  పూజించుట  మంచిది .  దీపారాధన  
        కొవ్వొత్తి  వెలిగించు  స్థలము .

వాయువ్య  భాగము  :

 51.    వాయువ్య  భాగము  విద్య  మరియు  రాజకీయ  స్థానము .  యోగములో  విశుద్ధ  గ్రంధి  థైరాయిడ్ ,  పారా  థైరాయిడ్ ,  పడమర  సూర్యనాడి   ఉత్తర  చంద్రనాడుల  సంగమం .    


 52.   వాయవ్య  భాగము  ఈశాన్యము  కంటే  మెరక  కల్గి  నైఋతి ,  ఆగ్నేయముల  కంటే  పల్లముగా  ఉంచవలెను .

 53.   వాయువ్య  భాగములో  సూర్యనాడి  తృతీయ  మగ  సంతతి పైనను ,  చంద్రనాడి  తృతీయ  ఆడ  సంతతి పైనను  తన  ప్రభావమును  చూపును .

 54.   వాయువ్య  భాగములో  నీరు  పోవు  మార్గము  లుండరాదు .  నీరు  వాయువ్య  భాగమునకే  వెళ్ళవలసి  వచ్చిన  చూపులకు  ఈశాన్యమునకు  ప్రవహింపజేసిన  తరువాత  
        అండర్  గ్రౌండ్ లో  వాయువ్యమునకు  ప్రవహింప  జేయవలెను .

 55.   వాయువ్య  భాగములో  బరువుల  నుంచరాదు .  వాయువ్య  బీరువా  భార్యాభర్తల  కలహము నకు  నాంది .  వాయువ్య  భాగములో   ఉత్తర  గోడకు  విడిచిన  వస్త్రములను  
        తగిలించరాదు .  వాయువ్య  భాగములో  కుర్చీలను  పడమట  గోడకు  ఆనించవచ్చును .   

 56.   వాయువ్య  భాగములో  గృహమును  నిర్మించరాదు .  ఉప గృహమును  సైతమూ  నిర్మించరాదు .  వాయువ్య  భాగములో  ఉత్తర  గోడను  ఆనించి  మరుగు  దొడ్లను ,  స్నానపు    
        గదులను  నిర్మించరాదు .  గృహమునకు  తూర్పు  భాగమున  కంటే   పడమర  భాగము  ఖాళీ  ఎక్కువ  ఉన్న  యెడల  ఆ  గృహ  యజమాని  బయట  తిరుగుటకు  ఎక్కువ  
        ఇష్టపడును .  పరిశ్రమలలో  ఉన్న  యెడల  దాని  యజమాని  దూరముగా  నివశించుట  గాని ,  నిదానముగా  దాని  పురోభివృద్ది  తగ్గుట  కాని  జరుగును .

 57.   వాయువ్య  భాగములో  నిద్రించరాదు .  పెండ్లి  కావలసిన  వారు  నిద్రించిన  పెండ్లికి  దూరమగుదురు .  పూర్తి  వాయువ్యంలో  గృహము  నిర్మించి  అందు  నివసించినను ,  పెండ్లి  
        జరుగుట  చాలా  కష్టము .  ఇటువంటి  గృహములోని వారు  విద్యలో  అమితముగా  రాణించుదురు .

 58.   పూర్తి  వాయువ్యములో  కూర్చొని  వ్యాపారము  చేయువారు ,  మాటలాడుట  యందు  ఎక్కువ  అభిలాష  కల్గి ,  వ్యాపారము  నందు  శ్రద్ద  తగ్గును .  వాయువ్యములో  కూర్చొని  
        తగవులు  తీర్చుట  మంచిది .

 59.   వాయువ్య  భాగములో  కూర్చొని  తూర్పునకు  చూస్తూ  చదివిన  విద్యార్ధులకు  విద్య  త్వరితముగా  లభించును .  రచయితలు  కళలను  అభ్యసించువారు  ఈ  విషయమును  
        గమనించవలయును .  పరిశ్రమలో  రీసెర్చ్  విభాగములు  వాయువ్యములో  నుండవలెను .

 60.   వాయువ్య  భాగములో  కూర్చొని  స్వంత  విషయములలో  నిర్ణయములు  తీసుకొనరాదు .  వాయువ్య  భాగము  వాదనకు  మంచి  స్థలము .  సైంటిస్టులు  ఏదయినా  క్రొత్త  
        విషయములను  కనిపెట్టవలెనన్న  వారు  వాయువ్య  భాగములో  కూర్చొని  కృషి  చేసిన  సత్పలితములను  పొందుదురు .  రచయితలకు  నూతన  పంథాలో  రచనలు  
        చేయుటకు  ఇది  మంచి  స్థలము .  అనగా  నూతన  విషయములను  వెలికి  తీయు  స్థానము  వాయువ్యము . 

 61.    గృహము  మొత్తములో  వాయువ్య గదికి  పడమర  వాయువ్యము  ద్వారము  కల్గి  నైఋతిలో  ఎత్తైన  ఆసనమునందు  కూర్చున్న  "  రాజకీయ  నాయకులు  "  అంచెలంచెలుగా  
        పదవుల  నందు  అభివృద్ధిని  సాధించెదరు .  పడమట  వాయువ్యంలో  రోడ్డు  శూల  కల్గిన  స్థలంలోని  వారు  సైతము  రాజకీయములో  రాణించుదురు . 

 62.   వాయువ్య  భాగములో  ధనము నుంచరాదు .  అనవసర  ఖర్చులకు  విపరీతముగా  ఖర్చగును .  వాయువ్య  భాగములో  కూర్చొని  ధన  సంబంధమైన  వ్యవహారములు  
        చేయరాదు .

 63.   వాయువ్య  భాగములో  సంగీత  సాధన  చాలా  మంచిది .  యోగ  సాధకులకు  ప్రాణాయామ ,  నాద  సాధనకు  మంచి  స్థలము .  టేపు  రికార్డులు ,  రేడియోలు  ఉంచు  స్థలము .

 64.   వాయువ్యములో  వంట  అధిక  వ్యయ  ప్రయాసములను  కల్గించును .  బియ్యపు  డబ్బాను ,  వంట  సామానులను  సైతము  ఈ  భాగములో  నుంచరాదు .  ఈ  భాగములో  
        భోజనము  చేయుట  మంచిది  కాదు . చిఱుతిళ్ళకు  నిలయము .

 65.   వాయువ్యములో  గర్భిణీ  స్త్రీలు  ఉండవలెను .  గర్భిణీ  స్త్రీలు  నివసించు  గదిలో  టి.వి. లు ,  ఫ్రిజ్  లను  ఉంచరాదు .

 66.   వాయువ్య  భాగములో  " చాదస్తులు "   " మనస్సు "   " మెదడు "  స్థిమితము  లేనివారు  నివసించరాదు .  మాటకు  కట్టుబడుట  చాలా  కష్టము .  ఈ  భాగములో  
        నివసించువారిని  నిశ్శబ్దముగా  ఉండమని  నిర్బందించిన  అనారోగ్యులగుదురు . 

 67.    వాయువ్య  స్థలము ( ఉత్తర , పడమట  రోడ్డుల  కలయిక )  లోని  స్త్రీలు  రాణించుదురు .  గృహము  సైతము  స్త్రీ  హక్కుగా  మారును .  వాయువ్య  స్థలములోని  పరిశ్రమలు  స్త్రీ  
         ల  ఆధ్వర్యంలో  రాణించును .

 68.    వాయువ్య  భాగము  తగ్గిన  ఆ  గృహములో  చదువులు  తగ్గును .  సమాజములోనికి  చొచ్చుకొని  పోవు  స్వభావము  తగ్గును .  ఊపిరితిత్తులు ,  ఆస్త్మాకు  సంబంధించిన  
         విషయములందు  జాగ్రత్త  వహించవలెను . 

 69.    వాయువ్య  భాగము  పల్లమైన  సంపదలను  కోల్పోవుదుము .  నూతులు ,  గోతులు  అనారోగ్యమును  కల్గించును . 

 70.    వాయువ్య  భాగములో  ఏవిధమైన  నీటి  తొట్టెలను  నిర్మించరాదు .  నైఋతి  ఆగ్నేయములలోని  కట్టడములను  మించి  ఈ  స్థలములో  ఏ  నిర్మాణములు  చేయరాదు .

 71.    వాయువ్య  భాగములో  మెట్లు  నిర్మించిన  ఉత్తర  గోడకు  ఆనించరాదు .  పడమటి  గోడకు  ఆనించి  కట్టవచ్చును . 

 72.    గృహములో  వాయువ్య  గది ,  నైఋతి ,  ఆగ్నేయ  గదుల  కంటే  తక్కువ ,  ఈశాన్యము  కంటే  ఎక్కువ  వైశాల్యము  కల్గి  ఉండవలెను .

 73.    వాయువ్య  భాగములో  పెంపుడు  జంతువులు  బాగుగా  పెరుగును .  గోవుల  శాలలు  నిర్మించు  స్థలము .  గోవుల  శాలలకు  ఉత్తర  ఈశాన్యము  పెరిగిన  పెయ్యలు ,  తూర్పు   
        ఈశాన్యము  పెరిగిన  కోడె  దూడలు  పుట్టుటకు  అవకాశము  కలదు .  గడ్డివాము  నుంచి  గడ్డి  తూర్పు ,  ఉత్తరము  నుంచే  తీయవలెను . 

 74.   వాయువ్య  భాగములో   "  సరస్వతీ  దేవి "    " ఆంజనేయ స్వామి "    " వెంకటేశ్వర స్వామి "  ని  పూజించుట  మంచిది .  కీర్తనలు  గానము  చేయుట ,  స్తుతించుట  
        మొదలగునవి  చేయవలెను .

 75.   వాయువ్య  భాగము  90o  కోణము  కల్గి  ఉండవలెను .  వాయువ్య  భాగములో  నీలము  రంగు  పూలు  పూచి మొక్కలు  బాగుగా  పెరుగును . వాయువ్యము  లోని  
        దోషములను  "  హం "   బీజాక్షరముతో  సరిచేయవలెను .

నైఋతి  భాగము  :

 76.     నైఋతి  భాగము  సంపూర్ణమైనది . యోగములో  ఆజ్ఞాచక్రము ,  గ్రంధి  పిట్యూటరీ ,  పడమర  సూర్యనాడి  దక్షిణ  చంద్రనాడుల  సంగమము .    

 77.     నైఋతి  భాగము  ఈశాన్య ,  వాయువ్య ,  ఆగ్నేయముల  కంటే  ఎత్తుగా  ఉండవలెను .  నిర్మాణములు  సైతము  నైఋతి లో  ఎత్తుగా  ఉండవలెను .

 78.     నైఋతి లోని  గది  అన్ని  గదుల  కంటే  ఎక్కువ  వైశాల్యము  కల్గి  ఉండవలెను .  ప్రహరీ  గోడలు  తతిమా  గోడల  కంటే  నైఋతి  లోనే  ఎత్తు  కల్గి  ఉండవలెను .   

 79.     నైఋతి  భాగములో  సూర్యనాడి  గృహ యజమాని ,  ప్రథమ  ఆడ  సంతతి  పైనను  తన  ప్రభావమును  చూపును .  

 80.     నైఋతి  భాగములో  విధిగా  గృహ యజమాని , యజమానురాలు  నిద్రించవలెను .  తొలి  సంతానము  దక్షిణము ,  మిగతా వారు  తూర్పు  తలాపి  నిద్రించుట  మంచిది .   
          ఆలోచనాపరులకు  దక్షిణము ,  శ్రామికులకు  తూర్పు  తలాపి  నిద్రించుట  మంచిది .

 81.     గృహ యజమాని ,  పరిశ్రమల  యజమాని ,  ఆఫీసులలో  ఆఫీసరు ,  షాపుల  యజమాని ,  రాజకీయ  నాయుకులు ,  కార్యక్రమములను  నడిపించు  పెద్దలు  మొదలగు వారు  
         విధిగా  తూర్పుకు  చూస్తూ  నైఋతిలో  కూర్చొనవలయును .  మిమ్మల్ని  ఎవరైనా  సలహా  అడిగినా  నైఋతిలోనే  ఉండి  ఆలోచించి  సలహా  ఇవ్వవలెను .

 82.     నైఋతి  భాగము  అన్ని  భాగముల  కంటే  జయము నొందు  స్థలము .  ఈ  భాగములో  కూర్చొని  ఆలోచించుట  మంచిది .  సరి  అయిన  పరిష్కారములను  సూచించును .  
         నిష్కర్షమైన  భావమును  కల్గించును .  ఆలోచనను  పెంచును .  కోపమును  తగ్గించును .  సమయానుకూలమగు  ఆలోచనలను  కల్గించును .  " పర్సనల్  అసిస్టెంట్స్ "   
         ముఖ్యముగా  ఈ  విషయము  పాటించవలెను .     

 83.     నైఋతి  భాగము  అన్ని  భాగములకు  తండ్రి  వంటిది .  ప్రతి  స్థలమునకు   "  భూశక్తి "   నైఋతి  నుంచి  ప్రారంభించి  ఆగ్నేయ  వాయువ్యములను  కలుపుకొనుచూ  
         ఈశాన్యమునకు  వచ్చు  సరికి  క్షీణించును .  గృహమును  నైఋతి  సరిహద్దు  గోడల  మీద  నిర్మించకుండా ,  విడిగా  నిర్మించిన  ఈ  " భూశక్తి "  రెట్టింపగును . నైఋతిలో  
         ద్వారములున్న  ఈ  శక్తి  నిష్ప్రయోజన  మగును .  

 84.     నైఋతి  భాగములో  విధిగా  ఎత్తు  బీరువాలను ,  అతి బరువు గల  వస్తువులను  ఉంచవలెను .  బీరువా  తరువాత  మంచము  నుంచవలెను .  ఆఫీసులో  ఫైల్సును  సైతము  
         టేబిలుకు  నైఋతి  లోనే  ఉంచవలెను .

 85.     నైఋతి  భాగములో  ధాన్యపు  గాదెలు ,  గోడౌన్లు  నిర్మించవలెను .  వ్యర్ధమైన  వస్తువులను  ఈ  భాగములో  నుంచరాదు .  నైఋతి  భాగము  " ప్రాణ శక్తి "  ని  పెంచే      
         స్థలముగాన  పచ్చళ్ళ  జాడీలు ,  బియ్యపు  డబ్బాలు ,  నిల్వ  ఉంచే  ఆహార పదార్థములు ,  ఫ్యాక్టరీలకు  ఉపయోగించే  ముడి  పదార్థమును ,  షాపులలో  స్టాకును  నైఋతి 
         లోనే  ఉంచవలెను .  

 86.     నైఋతి  భాగములో  ధనము  నుంచవలెను .  బీరువాలో  సైతము  నైఋతిలోని  ధనము  నుంచవలెను .  బంగారము ,  ఇతరము లైన  నగలు  ఈ  స్థానములో  ఉంచవలెను .  
         మీ  బీరువా  సూర్యనాడి  వైపు  తెరుచుకున్నచో  మంచి  కీర్తి ,  ధనము ,  యశస్సు ,  ప్రాప్తించును .  చంద్రనాడి  వైపు  తెరుచుకున్నచో  ధనము ,  పొదుపు ,  ప్రశాంతత  
         ప్రాప్తించును .

 87.     నైఋతి  భాగములో  వంట  చేయరాదు .  ఈ  భాగములో  నీరు  పోవు  కంతల  నుంచి  రాదు .  పరిశ్రమలు  మరియు  హోటల్స్ లో   ఈ  విషయమును  పాటించవలయును .  

 88.     నైఋతి  భాగములో  గృహము  నిర్మించిన  సిరిసంపదలు ,  సౌఖ్యము ,  ఆరోగ్యము ,  కీర్తి ,  మనశ్శాంతి ,  జ్ఞానమును  కల్గించును .  ప్రతి  మనిషి  తనకున్న  " శక్తి "  ని  
          పూర్తిగా  వియోగించవలెనన్న  నైఋతి  భాగములో  గృహము  నిర్మించవలయును .

 89.     నైఋతి  తగ్గిన  గృహ యజమాని  ప్రయోజకత్వము  తగ్గును .  పరిశ్రమలకు  నైఋతి  తగ్గిన  యజమాని  లోపముతో  త్వరితముగా  మూతపడును .

 90.     నైఋతి  భాగములో  వాటర్  ట్యాంక్ లో  ఎత్తుగా  ఉండవలెను .  నేలకు  ఆనకుండా  ట్యాంక్  నిర్మించవలెను .  ట్యాంక్ లో  ఈశాన్య  భాగములో  పడమట  చూస్తూ  నీరు  పడుట  
         మంచిది .  నీరు  బయటకు  వచ్చు  మార్గము ,  కడిగెడు  నీరు  పోవు  మార్గము  సైతము  ఈశాన్యములోనే  ఉంచవలెను .  పైన  మూతతో  మూయవలెను .  పై  మూతలు  
         తూర్పు ,  ఉత్తర  వాలు  కల్గి  ఉండవలెను .  పిడుగుల  హైవోల్టేజి  కరెంటు  ఎర్త్  చేయుటకు  పెట్టే  త్రిశూలము ,  శూలము  మొదలగునవి  నైఋతి  భాగములో  ఏర్పాటు  
         చేయవలెను .

 91.     నైఋతి  భాగములో  ఎత్తైన  చెట్లు  పెంచుట  మంచిది .  గృహ  సముదాయములో  పరిశ్రమలలో  నైఋతి  లోని  గృహము  ఎత్తుగాను  తతిమా  గృహముల కన్న  వైశాల్యము  
         పెరిగి  ఉండవలెను .

 92.     నైఋతి  భాగము  ఎప్పుడూ  మూసి  ఉంచుట  మంచిది .  స్థలములో  నైఋతి  తెరిపిగా  ఉన్న  ఎత్తుగా  చుట్టిల్లు  వేయవలెను .  ఖాళీ  స్థలములందు  గృహము  కట్టబోవు  
         స్థలమునందు ,  అన్ని  స్థలములందు  ఎల్లప్పుడూ  నైఋతి  మూసి  ఉంచవలెను .

 93.     నైఋతి  భాగములో  చంద్రనాడి  పల్లమైన  గుండె పైనను  సూర్యనాడి  పల్లమైన  కాళ్ళు , చేతల  మీదను  తన  ప్రభావమును  చూపును .  నైఋతి  భాగము  అంతయు  
         పల్లముగా  ఉన్న ,  హార్ట్ ఎటాక్ ,  కాన్సర్ ,  డిప్రషన్ ,  మెదడు ,  విషయములందు  తగు  శ్రద్ధ  వహించవలెను .

 94.     నైఋతి  భాగములో  లెట్రిన్  నూతుల  నుంచరాదు .  గృహమునకు  తూర్పు  ఉత్తర  ఈశాన్యములలో  బావికి  దూరముగా ,  గోడ  శూలలోను ,  ద్వారములలోకి  రాకుండా  
         లెట్రిన్  నూతులు  ఉంచవలెను . 

 95.     నైఋతి  భాగములో  చంద్రనాడిలో  పెద్ద  కిటికీ  ఉన్నచో  ఆ  గృహములో  ప్రేమతత్వము  పెరుగును .  పరిశ్రమలలో ,  షాపులలో  పని చేయుచున్న  వారికి  నైఋతి లోని  చంద్రనాడి  గాలి  అవసరము .  అలసట  రానీయదు .  వాస్తవమైన  ఆలోచనలను  కల్గించును .

 96.     " నాడీ "  శాస్త్రములలో  చంద్రనాడి  ప్రభావము  లన్నియు  నైఋతి  భాగమునకు  చెందును .  ధ్యానమునకు  మంచి  స్థలము .  ఆసనములలో  శీర్షాసనము ,  హలాసనము ,  
         మయూరాసనములకు  మంచి  స్థలము .  డాక్టర్లకు  శస్త్ర  చికిత్సకు  మంచి  స్థలము .  వెయిట్ లిఫ్టర్స్ కు  మంచి  స్థలము . స్త్రీ , పురుషుల  సంగమమునకు  మంచి  స్థలము .

 97.     నైఋతి  భాగములో  ఎటువంటి  వీధి  శూలలు  మంచిది  కాదు .  నైఋతి  భాగములో  ఇండిగో  రంగు  పూలు  పూచే  మొక్కలు  బాగుగా  పెరుగును .

 98.     గృహ  నిర్మాణములో  ప్రారంభము  ఈశాన్యములో  చేసినను ,  నిర్మాణములో  నైఋతి  భాగమును  ముందుగా  ఎత్తుగా  కట్టుచూ  ఉండవలెను .  గృహ  నిర్మాణము  పూర్తి  
         అయ్యేవరకూ  ఈ  నియమమును  పాటించవలెను .  ప్రతి  గదికి  నైఋతి  భాగములో  మిద్దెలు , అటకలు  ఉండవచ్చును .

 99.     నైఋతి  భాగములో  " శివుని "   " వినాయకుని "  ఉంచి  పూజించవలెను .  ధాన్యపు  గాదెలలో ,  గోదాములో ,  
         పరిశ్రమలలో ,  షాపులలో ,  హాస్పిటల్స్ లో   అన్ని  చోట్ల  నైఋతిలో  వినాయకుని  ఉంచి  పూజించవలెను .  గంట  
         శబ్ధమునకు  స్థానము .

100.    నైఋతి  భాగము   90o    కోణము  కల్గి  ఉండవలెను .  నైఋతి  భాగములోని  దోషములను  ఇండిగో  రంగుతోను  " సం "  
          బీజాక్షరముతోను  నివారించవచ్చును .

101.     మీరు  మీకున్న  సర్వశక్తులనూ  ఉపయోగించవలెనన్న  తూర్పునకు  చూస్తూ  నైఋతిలో  కూర్చొనవలయును .   

102.    తూర్పు  ప్రహరీ ,  తూర్పు  అరుగులు  పురుష  సంతతిపైనను ,  ఉత్తర  ప్రహరీ ,  ఉత్తర  అరుగులు  స్త్రీ  సంతతిపైనను ( పెండ్లి  అయి  వెళ్ళినను )  తన  ప్రభావమును  
          చూపును .

103.    గృహమును  గాని  స్థలమును  గాని  వాటాలు  చేసినపుడు  మొదటి  సంతానం  నైఋతి ,  రెండవ  సంతతి  ఆగ్నేయము ,  మూడవ  సంతతి  వాయవ్య  భాగమును ,  నాల్గవ  
          సంతతి  ఈశాన్య  భాగములో  ఉండవలెను .  గృహములో  తూర్పు ,  పడమర  దోషములు  యజమాని , మగ  సంతతిపైనను ,  ఉత్తర , దక్షిణ  దోషములు  యజమానురాలు ,  
          స్త్రీ  సంతతిపైనను  తన  ప్రభావమును  చూపును .

104.     " మంత్రము "  -  " తంత్రము "  -  " యంత్రము "  అనునవి  మూడు  శక్తులు . మనము  వాస్తులో  "  యంత్రము "  అను  శక్తిని  మాత్రమే  ఉపయోగించుచున్నాము .
          తతిమా  రెండు  శక్తులను  ఉపయోగించుట వలన  సంపూర్ణత  కల్గును .  గృహయజమాని  చేసిన  ఈ  శక్తులు  ఫలితమిచ్చును గాని ,  ఇతరులు ( అన్యులు )  చేసిన  ఈ   
          శక్తులు  ఫలితములు  నీయవు .  కనుక  మంత్ర ,  తంత్రములను  సునిశిత  దృష్టితో  పరిశీలించి  స్వయముగా  సాధన  చేసి  " బీజాక్షర , గణిత "  శక్తుల  ద్వారా  మన  
          మెదడులోని  శక్తిని  పెంపొందించు కొని  సంపూర్ణతను  సాధించవలయును . 

105.    తోబుట్టువులకు  వస్త్రములను  ఇచ్చి  ఈశాన్య  లోపము ,  సోదరులకు  వస్త్రములు  ఇచ్చి  ఆగ్నేయ  లోపమును ,  గురువునకు , పెద్దలకు  వస్త్రములు  ఇచ్చి  వాయువ్య  
          లోపమును ,  తల్లిదండ్రులకు ,  దేవుని  విగ్రహములకు  వస్త్రములు  ఇచ్చి  నైఋతి  లోపమును  సరిచేయవచ్చును .  మనము  చేసే  నిత్య పూజలో  " తీర్థ , ప్రసాదములు "  
          ఈశాన్యము ,  " దీపారాధన "  ఆగ్నేయము ,  " సహస్రనామములు , గంట  శబ్ధము ,  కీర్తనలు "  వాయవ్యము ,  " కండ్లు  మూసుకొని  దేవునికి  నమస్కారము  చేయుట "  
          నైఋతి . 
                  
                " వినాయక "   " శివ "  స్తోత్రములు  నైఋతి ;   " విష్ణుమూర్తి "   " రాముల  వారు "   స్తోత్రములు  ఆగ్నేయము ;   " సరస్వతి "   " ఆంజనేయ స్వామి "   
          స్తోత్రములు  వాయువ్యము ;  " లక్ష్మి "   " రాజరాజేశ్వరి "   " అన్నపూర్ణ "   " గంగ "  స్తోత్రములు  ఈ శాన్యము .  
                  
                  న్యూమరాలజీలో   1,  5,  9   ఈశాన్యము ;  2,  6   ఆగ్నేయము ;  4,  8  వాయువ్యము ;   3,  7  నైఋతి .
                  మన  శరీరములో  చేతులు ,  నాలుక - ఈశాన్యము ;  ఉదరము ,  కళ్ళు - ఆగ్నేయము ;  ఊపిరితిత్తులు , చెవులు , పెదిమలు - వాయవ్యము ;  మెదడు - నైఋతి .
                  వైద్యములో  " కఫ "  దోషములు - ఈశాన్యము ;  " పిత్త "  దోషములు - ఆగ్నేయము ;  " వాత "  దోషములు - వాయవ్యము .
                  హస్త  సాముద్రికములో  లైఫ్  మరియు  మెంటల్ - నైఋతి ;  హర్ట్  లైన్ - వాయవ్య ;  సూర్య , చంద్ర - ఆగ్నేయ ;  ఫేట్  లైన్ - ఈశాన్య .
                  గ్రహములలో  " శుక్ర "   " చంద్ర "  -  ఈశాన్యము ;  " బుధ "    " సూర్య "  -  ఆగ్నేయము ;  " గురు "  -  వాయవ్యము ;  " శని "   " కుజ "   -  నైఋతి .
                 మెదడులోని  " ఆక్యుపెటల్  లోబ్ "  మణిపూర ,  ఆగ్నేయ  భాగము  మీదను ;  " ఫ్రంటల్  లోబ్ "  -  ఆజ్ఞ , నైఋతి  భాగము  మీదను ;  " టెంపోరల్  లోబ్ "  విశుద్ధ ,  
         వాయవ్య  భాగము  మీదను ;  " సెంట్రల్  లోబ్ "   స్వాధిష్టాన , ఈశాన్య  భాగము  మీదను  తన  ప్రభావమును  చూపును .  
                 మెదడులోని  " సెరిబ్రల్  కార్టెక్స్ "  నందు  నాలుక , వేళ్ళ  చివరలు ,  జననేంద్రియము - ( స్వాధిష్టాన - ఈశాన్య ) ;  పెదిమలు ( విశుద్ధ - వాయవ్య )  కు  ఎక్కువ  
         స్పర్శస్థానము కల్గి  వాటి యొక్క  " సునిశిత  తత్వము "  ను  సూచించుచున్నది .  ఇదే  విధముగా  మన  స్థల  నిర్ణయము  నందు  ఈశాన్య (స్వాధిష్టాన)  వాయవ్య (విశుద్ధ)  భాగములకు  ఖాళీ  స్థలమును  కేటాయించి , స్థలము  మరియు  గదుల  యొక్క  సునిశిత  తత్వమును  పెంపొందించవచ్చును .

106.    దక్షిణము  నుండి  వచ్చు  గాలి  అన్ని  గదుల  లోనికి  ప్రవేశించి  ఏ  వరుసలోనైనను  ఈ  చివర  నుంచి  ఆవల  చివర  వరకూ  ద్వారములు  ఉన్నను ,  ఇంటి  ఆవరణలో   
          గాని ,  ఇంటిలో  గాని ,  పువ్వులు  పూయని  మొక్కలు  గాని ,  లతలు గాని  ఉన్నచో  ఆ  గృహములోని  వారికి  ప్రాణశక్తి  పెరిగి  ప్రేమ  తత్వము  పెరుగును .  ఇదియే  
          యోగములోని   "  అనాహత " .  

107.    గృహములలో  బీములు  క్రింద ,  ఆగిపోయిన  గోడల  చూపులలోను ,  ద్వారములకు  ఎదురుగా  నిద్రించుట గాని ,  కూర్చొనుట గాని  చేయరాదు .  గృహములోని  చిన్న  
         తేడాలను  " కర్టెన్లు "  కట్టి  సరిచేయండి .  ఖాళీ  స్థలముల  తేడాలను  చిన్న  దడులతోను ,  అల్లికలతోను ,  నాపరాళ్ళతోను ,  చుట్టిల్లు  నిర్మించి  సరిచేయండి .  మరుగు  
         దొడ్డిలో  ఉత్తరము గాని  దక్షిణము గాని  చూస్తూ  కూర్చొనవలయును .  ఎందుచేతననగా  అలా  కూర్చున్న  యెడల  చంద్రనాడి  ప్రభావము  పెద్ద  ప్రేగులపై  చూపించును .

108.   మనకు  సర్వమును  ఇచ్చునవి  భూమి ,  నీరు ,  వాయువు ,  ఆకాశము . వీటిని  ఉదయము  మరియు  నిద్రపోవు  సమయము నందు  స్మరించి  తద్వారా  శాంతిని  
         పొందవలయును .

                                                  పృధివిః శాంతిః             ( భూమి )
                                                  ఆపః శాంతిః                ( నీరు )
                                                  అగ్నిః శాంతిః              ( అగ్ని )
                                                  వాయుః శాంతిః           ( వాయువు )
                                                  అంతరిక్షగం శాంతిః      ( ఆకాశము )
                                                           ఓం శాంతి  శాంతి  శాంతిః
      అని  అరచేతులను  రుద్దుకొని  రెండు  చేతులతో  కళ్ళ  నుండి  పాదముల  వరకూ  శరీరము  అంతటినీ  నిమరవలెను .
      గృహములోని  పంచ  భూత  శక్తి ( భూమి ,  నీరు ,  అగ్ని ,  వాయువు ,  ఆకాశము )  మన  మెదడులోని  మరియు  నాడీ  మండలము  పై  తన  ప్రభావమును  చూపి ,  మన  ఆలోచనా  క్రియాదులను  మార్పు  చేయుచున్నది .  అదే  విధముగా గృహము లోని  వాస్తును  సరిచేసి  వాస్తు  శక్తిని  మనకు  అనుకూలముగా  మార్చుకొని  సుఖశాంతులను , ఆనందమును  పొందవలెను . 
                                                                                          
                                                                     ఓమ్
     
          మనకు  సాధ్యమయిన  ఆసనములో  కూర్చొని  కండ్లు  మూసుకొని   " ఓమ్ "  ను  జపించవలయును .  ముందుగా  మీరు  వెన్నుపూస  కదలకుండా  పీల్చ గలిగినంత  గాలిని  పీల్చి  " ఓ "  ను  ఉచ్చరించుచూ  రెండు  పెదవులను  మూసి  " మ్ "  ను  దీర్ఘముగా  చెప్పవలయును .  అనగా  పెదవులు  తెరచి  తక్కువ  సేపు ,  పెదవులు  మూసి  ఎక్కువ  సేపు  ఉచ్చరించవలయును .  " ఓ "  ను  గొంతు  నుండి ,   " మ్ "   ను  నాభి నుండి  వచ్చునట్లుగా   ఉచ్చరించవలయును .  ఈ  ఉచ్చారణ  సమయములో  కనుగుడ్లు  పైకి  ఎత్తుచూ  భ్రూమధ్యములో  వెలుగు  చూచుటకు  ప్రయత్నించవలెను . ప్రతిరోజూ  ఒకే  సమయములో  నియమముగా  చేయవలయును .  ఈ  విధముగా  చేయుట  వలన  " పారాసింపథిక్ "  నరములకు  ఉద్దీపన  కల్గి  మనకు  ఆనందము  కల్గును .  మెదడులోని  " న్యూరానుల "  నశింపు  తగ్గును .

                    మనస్సు     :     ధ్యానము  ( మీకిష్టదేవుని  గాని ,  ప్రదేశమును  గాని  ఊహించుచూ ) 
                    ఆనందము  :     ప్రతిరోజు  కుటుంబ  సభ్యులతో  20 నిమిషములకు  మించి  ఇష్టాగోష్టి
                    ప్రాణశక్తి       :     ప్రాణాయామము ,  " ఓమ్ "  జపము .
                    శరీరము      :     " సూర్య నమస్కారములు "   ఉదయపు  నడక .
                    జ్ఞానము     :     ప్రతిరోజూ  పుస్తక  పఠనము ,  జ్ఞాన  సంపన్నులతో  మైత్రి .         

                                                            ప్రపంచములోని  అందరికి  ఆయుర్ ఆరోగ్య ప్రాప్తిరస్తు !
                                            ప్రపంచములోని  అందరికి  మానశిక  ప్రశాంతత  అభివృద్దిరస్తు !
                                            ప్రపంచములోని  అందరికి  సకల  ఐశ్వర్యాభి వృద్దిరస్తు !
                                            ప్రపంచములోని  అందరికి  ఇష్ఠ కామ్యార్థముల్  సిద్ధిరస్తు !                 
                                            ప్రపంచములోని  అందరికి  శుభమస్తు !
                                                                                           
                                                                               
                                      శ్రీ   శ్రీ   శ్రీ                                                                                  
                                    శ్రీ   శ్రీ   శ్రీ